సాక్షి, ముంబై: ప్రపంచ మార్కట్ల పతనం అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఎన్నడూ లేని భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని హెవీ వెయిట్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడి పోయాయంటే, పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 3100 పాయింట్లకు పైగా కుదేలవ్వగా, నిప్టీ 900 పాయింట్లు పతనమైంది. ఆఖరి గంటలో స్వల్పంగా పుంజుకుని చివరికి సెన్సెక్స్ 2919 పాయింట్ల నష్టంతో 32778 వద్ద రెండేళ్ల కనిష్టానికి చేరింది. నిఫ్టీ 868 పాయింట్లు పతనమై 9590 వద్ద 32 నెలల కనిష్టానికి చేరింది. తద్వారా నిఫ్టీ 10వేల స్థాయిని, 9600 స్థాయిని కూడా కోల్పోయింది. మెటల్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి, బ్యాంకు నిఫ్టీ రికార్డు స్థాయిలో పడిపోయింది. మొత్తంగా స్టాక్‌మార్కెట్లో ఇదే అతిపెద్ద ఒకరోజు పతనం. బీపీసీఎల్, యెస్ బ్యాంక్‌లు 15శాతం పైగా, ఎస్‌బీఐ, వేదాంతా, ఐటీసీలు 13శాతం పైగా నష్టపోయాయి. టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జిసి, గెయిల్ ఇండియా, హిందాల్కో కూడా 10 శాతం నుంచి 15 శాతం క్షీణించాయి. టాటా పవర్స్, ల క్ష్మీవిలాస్ బ్యాంకు స్వల్పంగా లాభపడ్డాయి. అటు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరగడం రూపాయి భారీ నష్టపోతోంది. గత కొన్ని వారాలుగా క్రమంగా దిగివస్తున్న రూపాయి ఇవాళ ఒక్క రోజే 61 పైసల మేర నష్టాలను మూట కట్టుకుంది. ట్రేడింగ్ ఆరంభంలోనే రూ. 74.35కు పడిపోయింది. బుధవారం రూ. 73.61 డాలర్ వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాక్‌లోని అన్బర్ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ ముఠాల స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సాయుధ దళాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతోమరో ఇద్దరు మరణించారు. దీనికి ప్రతిగా అమెరికా జరిపిన ప్రతి దాడిలో మొత్తం 25మంది సైనికులు మృతి చెందారు.